ప్రభాస్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఈ పేరు మార్మోగుతోంది. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. నిజానికి ప్రభాస్‌ హీరో అవుతాడని కుటుంబసభ్యులెవరూ ఊహించలేదు. తెరపై కనిపించేందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. డార్లింగ్‌ సినీ ఇండస్ట్రీ ఎంట్రీ అచ్చం సినిమా కథనే తలపిస్తుంది.


2002లో డైరెక్టర్‌ జయంత్‌ సి పఠాన్‌ జీ ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ చేసే ఉద్దేశంతో హీరో కోసం వెతుకుతున్నాడు. కొత్త కుర్రాడితో సినిమా చేయాలన్నది ఆయన ప్లాన్‌. ఓ రోజు జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లిన డైరెక్టర్‌ జయంత్‌కు అక్కడ ప్రభాస్‌ కనిపించాడు. రెండో ఆలోచన లేకుండా తనే హీరో అని ఫిక్సైపోయాడు. ప్రభాస్‌ గురించి ఎంక్వైరీ చేసి కృష్ణంరాజు తమ్ముని కొడుకు అని తెలుసుకుని సినిమా చేసేందుకు ఒప్పించాడు. వైజాగ్‌ సత్యానంద్‌ దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పించాడు. ఇలా ఓ సినిమా స్టోరీని తలపించే ఘటనల తర్వాత తెరకెక్కిన సినిమానే ఈశ్వర్‌.


2002 నవంబర్‌ 11న ఈశ్వర్‌ సినిమా రిలీజైంది. మూవీలో ఆరడుగుల కటౌట్‌ను చూసి కొందరు పాజిటివ్‌గా మరికొందరు నెగిటివ్‌గా రియాక్టయ్యారు. అంత పొడవున్నాడు డ్యాన్స్‌ చేయగలడా..? సిగ్గూ మొహమాటం ఎక్కువంట హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తాడా.? అన్న డౌట్స్‌ తలెత్తాయి. కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌ అన్నట్లు ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు ప్రభాస్‌. ఫస్ట్‌ మూవీ ఈశ్వర్‌తోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌ నిరంజన్‌, డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, రెబల్‌, మిర్చీ ఇలా వరుస సినిమాలతో ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు. వర్షం మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో ప్రభాస్‌కు స్టార్‌ హీరో ఇమేజ్‌ వచ్చింది. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ సాధించిన ఫస్ట్‌ టాలీవుడ్‌ హీరోగా మారిపోయాడు ప్రభాస్‌.


హీరో అంటే ఇలాగే ఉండాలన్నట్లు అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సుస్థిరం చేసుకున్నాడు ప్రభాస్‌. అదేమీ ఆషామాషీగా జరిగింది కాదు. అందుకోసం ఎంతో ఓపిక పట్టాడు. మరెంతో కష్టపడ్డాడు. ప్రభాస్‌ కెరీర్‌ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు తర్వాత అని చెప్పాలి. ఆ మూవీ ప్రభాస్‌ కెరీర్‌ను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్‌ ఒదిగిపోయాడు. జక్కన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఐదేళ్ల పాటు ఒకే సినిమాకు కమిట్‌ అవ్వడం ఆయన అంకిత భావానికి నిదర్శనం. ఆ కష్టానికి ఫలితం దక్కింది. 2015లో రిలీజైన బాహుబలి ది బిగినింగ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.700 కోట్లకుపైగా రాబట్టింది. 2017లో విడుదలైన బాహుబలి ది కన్లూజన్‌ ఏకంగా 1700 కోట్లకుపైగా వసూళ్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఒక తెలుగు సినిమా 2 వేల కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్‌, వరల్డ్‌ సినిమా ఇండస్ట్రీని టాలీవుడ్‌ వైపు చూసేలా చేసింది. కేవలం భారతీయ భాషల్లోనే కాదు విదేశీ భాషల్లోనూ విడుదలైన బాహుబలి ఫారిన్‌ కంట్రీల్లోనూ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెంచింది.


బాహుబలి తర్వాత డార్లింగ్‌ రేంజ్‌ మారిపోయింది. బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ తర్వాత సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. బాహుబలి సక్సెస్‌ తర్వాత ప్రభాస్‌కు పాన్‌ ఇండియా ఆఫర్లు క్యూ కట్టాయి. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్‌ ఇండియా మూవీ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లోవిడుదలైంది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పనిచేసిన ఈ మూవీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ ఆడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. అద్భుతమైన కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద మరోసారి ప్రభాస్‌ సత్తా చాటింది.


ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ 20వ చిత్రంగా రాధేశ్యామ్‌ రూపుదిద్దుకుంటోంది. పూజాహేగ్డే హీరోయిన్‌. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.


రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఎపిక్‌ విజువల్‌ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న మరో పాన్‌ ఇండియా మూవీ ఆది పురుష్‌. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కృతి సనన్‌ సీత పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు ధీటుగా రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న రిలీజ్‌ చేయనున్నారు.


మరోవైపు ప్రభాస్‌ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో సలార్‌ మూవీ రెడీ అవుతోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గతంలో హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ ఈ టెక్నాలజీని తన సినిమాల్లో ఉపయోగించారు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న మొట్టమొదటి ఇండియన్‌ మూవీ సలార్‌ కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్‌తో శృతి హసన్‌ జత కట్టనుంది. మలయాళ స్టార్‌ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.


ఇక పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో పాన్‌ వరల్డ్‌ మూవీ చేసేందుకు సిద్ధమైంది వైజంయంతీ మూవీస్‌. మహానటితో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ కే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో విజువల్‌ వండర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మూవీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం 200 కోట్లకుపైగా బడ్జెట్‌ కేటాయించినట్లు సమాచారం. ప్రాజెక్ట్‌ కే కు సంబంధించి స్క్రిప్ట్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తికాగా… రాధేశ్యామ్‌ విడుదలైన తర్వాత ఈ సెట్స్‌పైకి వెళ్లనుంది. 13 నెలల పాటు ఏకధాటిగా షూటింగ్‌ చేయాలన్నది మేకర్స్‌ ప్లాన్‌ కాగా.. ఇందుకోసం ప్రభాస్‌ 200 రోజుల డేట్స్‌ ఇచ్చినట్లు సమాచారం.


స్టార్‌ మూవీ మేకర్స్‌ అందరూ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయడాన్ని స్టేటస్‌గా భావిస్తున్నారు. తమ సినిమాల్లో నటిస్తే ఎంత భారీ మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆసియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకునే హీరోగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రికార్డు సృష్టించారు. తాజాగా ఆ రికార్డును ప్రభాస్‌ బీట్ చేశారు. ప్రభాస్‌ ఒక్కో చిత్రానికి కనీసం వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. 25వ చిత్రంగా వస్తున్న స్పిరిట్‌ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. రానున్న రెండేళ్లలో ప్రభాస్‌ సినిమాలు బాక్సీఫీస్‌ వద్ద మినిమం 3వేల కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని దర్శకనిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ఆ కారణంతోనే రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటా, డబ్బింగ్‌ రైట్స్‌ ఇచ్చేందుకు మేకర్స్‌ ఏ మాత్రం వెనకాడటం లేదు. మొత్తమ్మీద 20ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో సక్సెస్‌లతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ త్వరలోనే పాన్‌ వరల్డ్‌ స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం.