నటనకు, చదువుకు సంబంధంలేదు. సినిమాల్లో నటించేందుకు ఎలాంటి క్వాలిఫికేషన్లు అవసరం లేదు. నటనలో ఇరగదీసే టాలీవుడ్ హీరోల్లో కొందరు సరస్వతీ పుత్రులు కూడా ఉన్నారు. యాక్టింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకోకముందే డిగ్రీ పట్టాలు అందుకున్నారు. టాలీవుడ్ హీరోల్లో చాలా మంది అండర్ గ్రాడ్యుయేట్లు కాగా.. మరికొందరు ఇంజనీరింగ్‌తో పాటు ప్రొఫెషనల్ డిగ్రీలు అందుకున్న వారు ఉన్నారు. తెలుగు సినీ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లను ఓ సారి గమనిస్తే..
నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. నర్సాపూర్‌లోని YN కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ నుంచి ఆయన గ్రాడ్యుయేట్ అయ్యాడు. విక్టరీ వెంకటేశ్‌కు చిన్నప్పటి నుంచి బిజినెస్‌మేన్ కావాలని ఆశ. అందుకే లయోలా డిగ్రీ కాలేజ్ నుంచి బీకామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. కింగ్ నాగార్జున ఇంజనీర్. మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లాడు. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి వచ్చాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్కూలింగ్ భీమవరంలో జరిగింది. ఇంటర్మీడియెట్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా అండర్ గ్రాడ్యుయేట్. ఆంధ్రా లయోలా కాలేజ్ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇక యాంగ్రీ హీరో రాజశేఖర్ డాక్టర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన.. కొంతకాలం పాటు ప్రాక్టీస్ కూడా చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడు.
నందమూరి వారసుడు కల్యాణ్ రామ్ బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశాడు. మరో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు చదువు కన్నా డ్యాన్సులు, నటనపైనే ఆసక్తి ఎక్కువ ఉండేది. హీరోగా మారడంతో ఆయన చదువు ఇంటర్‌తోనే ఆగిపోయింది. డిగ్రీ చదివే ఏజ్ వచ్చే సరికి తారక్ సూపర్ స్టార్ అయిపోయాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగానే చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి బ్యాచిలర్స్ పట్టా అందుకున్నాడు. గోపీచంద్, నితిన్ బీటెక్ చదివారు.
యువ సామ్రాట్ నాగచైతన్యకి మ్యూజిక్ అంటే పిచ్చి. అందుకే లండన్‌లోని మ్యూజిక్ కాలేజీలో కీబోర్డు నేర్చుకున్నారు. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. అఖిల్ అక్కినేని చదువంతా విదేశాల్లోనే సాగింది. కాలేజ్ ఆఫ్ మెరైన్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. హాలీవుడ్ లో నటనకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చేశారు. మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశాడు. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ హైదరాబాద్‌లోని సెయింట్ మేరీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నేచురల్ స్టార్ నాని.. వెస్లీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇక హీరో శర్వానంద్‌కు చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంటర్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వెళ్తానని చెప్పడంతో డిగ్రీ పూర్తి చేశాకే వెళ్లమని అతని తల్లి కండీషన్ పెట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ నుంచి బీకాం కంప్లీట్ చేశాడు.
జాతిరత్నం నవీన్ పొలిశెట్టి మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ భోపాల్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందాడు. సివిల్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసిన తర్వాత యూట్యూబ్ స్టార్‌గా మారాడు. 2019లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజ్ నుంచి బీకాం పూర్తి చేశాడు. తొలి చిత్రం ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న హీరో కార్తికేయ వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చాడు.