స్టార్‌ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన అందరూ స్టార్లు అయిపోరు. టాలెంట్‌ లేకపోతే ఎంత గొప్ప బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా.. ప్రేక్షకులు పట్టించుకోరు. ఎన్టీఆర్‌ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్‌ కొడుకుగా తెరంగేట్రం చేసినా.. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో బాలయ్య చేయని పాత్ర లేదు. ట్రై చేయని జోనర్‌ లేదు. వందకుపైగా చిత్రాల్లో నటించినా.. వేటికవే ప్రత్యేకం. జానపదం, పౌరాణికం, చారిత్రకం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌.. అదీ ఇదీ అనే తేడాలేకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించారు. ప్రయోగాలకు పెద్దపీట వేసి క్లాస్‌ మాస్‌ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నాడు..


తాతమ్మ కల సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు బాలకృష్ణ. అప్పటికి ఆయన వయసు 14 ఏళ్లు. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రికే మనవడిగా నటించడం విశేషం. టాలీవుడ్‌లో తండ్రితో కలిసి 12 చిత్రాల్లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణ. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల, దానవీర శూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం తదితర చిత్రాల్లో నటించాడు బాలయ్య.


సోలో హీరోగా బాలయ్య తొలి చిత్రం సాహసమే జీవితం. 1984లో రిలీజైన ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. స్టార్‌ డైరెక్టర్‌ కోదండరామిరెడ్డి, బాలయ్యలది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కాంబోలో 13 సినిమాలు రాగా.. వాటిలో 9 సూపర్‌ హిట్‌. ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో 7 చిత్రాలు చేస్తే.. అందులో ఆరు బ్లాక్‌ బస్టర్స్. బాలయ్య లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. తన సినిమా పేర్లలో సింహం అనే పదం కలిసొచ్చేలా టైటిల్‌ పెట్టడం ఆయనకు సెంటిమెంట్‌. సింహం నవ్వింది, బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా వంటి 8 సినిమాలకు సింహం పేరు కలిసొచ్చేలా టైటిల్‌ పెట్టుకున్నారు.


పోలీస్ పాత్రలకు బాలకృష్ణ బెస్ట్‌ ఛాయిస్‌. ఆయన ఇప్పటి వరకు 12 చిత్రాల్లో పోలీస్‌గా కనిపించారు. భలే తమ్ముడు, ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, తిరగబడ్డ తెలుగుబిడ్డ, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, మాతో పెట్టుకోకు, సుల్తాన్‌, భలేవాడివి బాసు, సీమ సింహం, చెన్న కేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, అల్లరి పిడుగు, రూలర్‌ సినిమాల్లో బాలయ్య పోలీస్‌ పాత్ర పోషించాడు. ఒక్క ఏడాదిలో 8 సినిమాలు విడుదలైన హీరోగా బాలకృష్ణ రికార్డు సొంతం చేసుకున్నారు. 1987లో ఆయన నటించిన అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, రాము, అల్లరి కృష్ణయ్య, సాహస సమ్రాట్‌, ప్రెసిడెంట్‌ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. బాలకృష్ణ – విజయశాంతిలది సూపర్‌ హిట్‌ జోడీ. అందుకే దర్శక నిర్మాతలు బాలయ్య సరసన విజయశాంతిని ఫస్ట్‌ ఛాయిస్‌గా ఎంచుకునే వారు. వీరిద్దరూ జంటగా 17 సినిమాల్లో నటించారు. ముద్దుల మావయ్య, భలే దొంగ, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, భార్గవ రాముడు, లారీ డ్రైవర్‌ తదితర చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.


ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా బాలయ్య సొంతం. ఏ హీరోకైనా డాన్‌ రోల్‌ చేయాలన్నది కల. బాలయ్య ఐదు సినిమాల్లో డాన్‌గా నటించాడు. నిప్పులాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, అశోక చక్రవర్తి, యువరత్న రాణా, సుల్తాన్ చిత్రాల్లో ఆయన డాన్‌ పాత్ర పోషించారు. సెకండ్‌ జనరేషన్‌ హీరోల్లో పౌరాణిక పాత్రలు చేసిన హీరోల్లో బాలయ్యదే అగ్రస్థానం. తండ్రి ఎన్టీఆర్‌, అన్న హరికృష్ణతో కలిసి శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన బాలకృష్ణ.. తండ్రితో కలిసి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు, దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక, ఛారిత్రక పాత్రలను పోషించారు. బ్రహ్మర్షి విశ్వామిత్రలో ఎన్టీఆర్‌ విశ్వామిత్రుడిగా, రావణుడిగా నటిస్తే బాలయ్య హరిశ్చంద్ర, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం.


90వ దశకంలో అనేక ప్రయోగాత్మక చిత్రాలకు సై అన్నారు బాలకృష్ణ. బాలయ్య సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఆదిత్య 369తో సూపర్‌ హిట్‌ కొట్టారు. టైమ్‌ ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీలో బాలయ్య శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో నటించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. ఆదిత్య 369ను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లోనే భైరవ ద్వీపం అనే జానపద చిత్రంలోనూ నటించారు బాలయ్య. మాస్‌ హీరోగా, గ్లామరస్‌ కథా నాయకుడిగా రాణిస్తున్న సమయంలో భైరవద్వీపంలో కురూపిగా నటించేందుకు ఆయన ఒప్పుకోవడం పెద్ద సాహసం. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.


టాలీవుడ్‌లో బాలయ్య చేసినన్ని డ్యూయెల్‌ రోల్స్‌ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు. 16 సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. 2012లో వచ్చిన అధినాయకుడు మూవీలో తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రలు చేసిన ఘనత బాలకృష్ణ సొంతం. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లోనూ బాలయ్య అనేక చిత్రాలు చేశారు. 1999లో బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహా రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఫ్యాక్షన్‌ మూవీల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. తాను నటించిన చిత్రాల్లో సమరసింహా రెడ్డి తనకెంతో ఇష్టమని చెబుతారు బాలకృష్ణ. ఇక తండ్రి బయోపిక్‌లో నటించిన ఏకైక హీరోగా అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాల్లో తండ్రి పాత్ర పోషించారు. ఈ సినిమాలతోనే ఎన్టీఆర్‌ నిర్మాతగా మారారు.


బాలయ్య ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ యాడ్‌లోనూ నటించలేదు. సహ నటులు అనేక యాడ్‌ ఎండార్స్‌మెంట్లు చేస్తున్నా.. ఆయన మాత్రం వాటికి ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. సోషల్‌ మీడియాలో కూడా బాలయ్య అంత యాక్టివ్‌గా ఉండరు. అసలు ఆయనకు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం అకౌంట్సే లేవు. ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్నా అందులో ఎలాంటి అప్‌డేట్స్‌ ఉండవు. అన్న కొడుకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌ చేయాలన్నది బాలకృష్ణ కోరిక. ఆ ప్రాజెక్టు కోసం తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన ఎన్నోసార్లు చెప్పారు.


బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అది త్వరలోనే జరుగుతుందని అభిమానులకు హామీ ఇచ్చాడు బాలయ్య. ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తొలి తెలుగు ఓటీటీ ఆహాలో అన్‌స్టాపబుల్‌ పేరుతో నిర్వహించనున్న టాక్‌ షోను బాలయ్య హోస్ట్‌ చేయనున్నారు. ఈ ప్రోగ్రాం కోసం దాదాపు రూ.5కోట్లు తీసుకుంటున్న బాలకృష్ణ ఆ మొత్తాన్ని ఛారిటీ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. దీన్ని బట్టి ఆయన మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.