హీరోయిన్గా అవకాశం వచ్చిందంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సినిమాలు చేస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలు చేస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలమని చాలామంది అనుకుంటారు. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇందుకు భిన్నమని చాటుకుంటోంది. హీరోయిన్గా గ్లామర్ పాత్రలు పోషించి ఫేడ్ అవుట్ అయిపోయే సమయంలో చాలామంది హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్, సాహసోపేతమైన క్యారెక్టర్లు చేస్తుంటారు. నిజంగా అంతకుముందు చేసిన గ్లామర్ పాత్రల కంటే కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పోషించే ఆ పాత్రలకే పేరు వస్తుంటుంది. నటులుగా కూడా ఆ పాత్రలే సంతృప్తినిస్తాయి. ఇలాంటి పాత్రలను కెరియర్ బిగినింగ్‌లో చేయాలంటే చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపరు. శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న, భావోద్వేగమైన కథలకే ప్రాధాన్యం ఇస్తోంది.
భిన్నకథలకే మొగ్గు
ఆఫ్–బీట్ హీరోయిన్ పాత్రలు మనసు చంపుకుని చేయలేనని దర్శకులకు శ్రద్ధ శ్రీనాథ్ కరాఖండిగా చెబుతోంది. కన్నడ యూటర్న్ సినిమాలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, విక్రమ్ వేద సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్రలే ఇందుకు నిదర్శనాలు. ఇక మలయాళంలో కోహినూర్ చిత్రంతో తెరకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్.. ఉర్వి, ఆపరేషన్ అలివేలమ్మ, ది విలన్, మిలన్ టాకీస్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తన మార్కులు తాను కొట్టేస్తోంది. ఇండస్ట్రీకి రాకముందు వృత్తిరీత్యా లాయర్‌గా పనిచేసిన శ్రద్ధా శ్రీనాథ్.. కమర్షియల్ ఫిలిమ్స్ లో, నాటకాల్లో నటిస్తూ సినిమా ప్రయత్నాలు చేస్తుండేది. నటన పట్ల మక్కువ, మంచి పాత్రలు చేయాలనే ఆసక్తి తో పాత్రల ఎంపికలో శ్రద్ధ వహిస్తోంది.
అవకాశాల వెల్లువ
జెర్సీ సినిమాలో గృహిణి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకుంది. క్రికెటర్ కావాలనుకున్న భర్త, భార్యకు మధ్య వచ్చే భావోద్వేగ పూరితమైన సన్నివేశాల్లో మెప్పించింది. ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ భాషల నుంచి శ్రద్ధా శ్రీనాథ్‌కు… మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. బాలీవుడ్లో సూపర్హిటైన పింక్ తమిళ్ రీమేక్‌లో నటిస్తోంది. హిందీలో అమితాబ్ పాత్రలో అజిత్ నటిస్తుండగా, తాప్సీ పోషించిన పాత్ర శ్రద్ధ శ్రీనాథ్‌కి దక్కింది. విశాల్ హీరోగా నటించిన అభిమాన్యుడు సీక్వెల్లో కీలకపాత్ర దక్కించుకుంది.
2015లో తెరకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్.. నాలుగేళ్లలోనే ఐదు భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకుంది. శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు ఎంచుకుంటున్న తీరు వైవిధ్య కథలతో సినిమాలు తీయాలి అనుకుంటున్న దర్శకులకు ఆమె బెస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తోంది.