ఓ 74 ఏళ్ళ వృద్ధురాలు. భర్త లేడు. కొడుకు, కోడలిపై ఆధారపడ్డ బతుకు. కొడుకంటే మమకారం. ప్రొఫెసర్‌గా సమాజంలో గౌరవంగా బతుకుతున్నాడని గర్వం. కోడలికి అత్తంటే అసహ్యం. ఎప్పుడు వదిలించుకుందామా అనే ఆలోచన. ఇలాంటి సమయంలో.. కొడుకు ఆస్పత్రి పాలవుతాడు. తల్లి బతుకు బజారునపడుతుంది. ఇది సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న `హో బేబీ` సినిమాలో ఓ ముఖ్యమైన పార్ట్‌.

ఓ మాయ ఫోటోస్టూడియో అడుగుపెట్టిన వృద్ధురాలు పూర్తిగా మారిపోతుంది. 20 ఏళ్ళ యువతిగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. చావుకోసం ఎదురు చూడటం తప్ప మరో మార్గం లేదనుకున్న సందర్భంలో.. ఊహించని జీవితం వరంగా దొరుకుతుంది. ఇంకేముంది అప్పుడేప్పుడో తాను యువతిగా ఉన్నప్పుడు, తనకిష్టమైన రోమన్‌ హాలీడే సినిమాలో కథానాయిక మాదిరిగా హేర్‌స్టైల్‌ మార్చుకుంటుంది. ఇష్టమైన జీవితం గడిపేందుకు సిద్ధమవుతుంది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వెంట పడటం, అప్పుడప్పుడు తాను యువతిని అనే సంగతి మార్చిపోవడం.. ఇలా సరదాగా గడిచి పోతుంది.

యువతిగా ఉన్న వృద్ధురాలు అలాగే ఉంటుందా..? తిరిగి వృద్ధిరాలిగా మారిపోతుందా..? చివరకు ఏమౌతుంది..? అనేది క్లైమాక్స్‌. ఈ సినిమా మొత్తానికి క్లైమాక్సే ప్రాణం. చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

2014లో కేవలం 22 కోట్ల రూపాయాలతో విడుదలైన ఈ కొరియన్‌ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అనేక భాషల్లో రీమేక్‌ అయింది. ఇప్పుడు తెలుగులో వస్తోంది. 70 ఏళ్ళ వృద్ధిరాలిగా సీనియర్‌ నటి లక్ష్మీ నటిస్తుండగా, యువతి పాత్ర సమంత పోషిస్తోంది. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, ఉర్వశి ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తోంది. సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో గతంలో జబర్దస్త్‌ సినిమా వచ్చింది. నాగశౌర్యతోనూ నందినిరెడ్డికి ఇది రెండో సినిమా. నందినిరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే సినిమాలో నాగశౌర్య నటించారు.

55 ఏళ్ళు పూర్తి చేసుకున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురుఫీల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.