ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజర్‌ రిలిజైంది. ఫ్యాన్స్‌ని మెప్పించేలా ఉంది. ప్రేమ సన్నివేశాల నుంచి యాక్షన్‌ వరకు సాహో అనిపించింది. బైక్‌లు, కార్లు, హెలికాఫ్టర్లతో ఛేజింగ్‌ సీన్లు… హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలను తలపించాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌ నటించిన సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌ క్రేజ్‌ పెరిగిపోయింది. ఆగస్టు 15న విడుదల కానున్న సాహోతో మరోసారి ప్రభాస్‌ పేరు మర్మోగిపోనుంది.

ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధకఫూర్‌ నటిస్తోంది. టీజర్‌ ప్రకారం.. హీరోయిన్‌ కోసం సాహసాలు చేసే ఫైటర్‌గా ప్రభాస్‌ కనిపిస్తాడనిపిస్తోంది. తనకెవరూ లేరని శ్రద్ధకపూర్‌ బాధపడుతుంటే.. నేనున్నానంటూ ప్రభాస్‌ మాటిస్తాడు. అప్పటి నుంచి యాక్షన్‌ షూరు అవుతుంది. టీజర్‌ ప్రారంభంలో.. అమాయకత్వం, అందం కలగలిపిన కథానాయికగా కనిపించే శ్రద్ధ చివరికి వచ్చేసరికి ఫైటింగ్‌లతో రఫ్పాడించింది. ఇక.. ప్రియురాలికి మాట ఇచ్చే ప్రేమికుడిగా కనిపించిన ప్రభాస్‌… తనదైన పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతాడు. యాక్షన్‌ సన్నివేశాలన్నీ హాలీవుడ్‌ స్థాయిలోనే ఉన్నాయి. బహుబలితో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. ఇప్పుడు సాహోతో మరో మెట్టు ఎక్కినట్టే కనిపిస్తోంది.

బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సాహోలో… జాకీష్రాఫ్‌, గుల్షన్‌గ్రోవర్‌, మందిరాబేడీ నటిస్తున్నారు. మురళీశర్మ, వెన్నెల కిషోర్‌ నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌ కేవలం కామోడీకే పరిమితం కాకుండా.. సాహోలో ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమా ప్రచారానికి సంబంధించిన థీమ్‌లు రిలీజ్‌
అయ్యాయి. షేడ్స్‌ ఆఫ్‌ షాడో, చాప్టర్స్ 1, చాప్టర్స్ 2, ఫస్ట్‌లుక్‌.. ఇప్పుడు టీజర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు అదిరిపోయాయి.

యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. రన్‌ రాజా రన్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్‌కి.. సాహో రెండో సినిమానే. రూ. 300 కోట్ల రూపాయాలకు పైగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికీ ఇంకా ఏమైన సందేహాలకు… టీజర్‌ ఓ సమాధానం ఇచ్చినట్లే. ప్రభాస్‌ అభిమానులకు ఆగస్టు 15 పండగే.