ప్రపంచకప్‌ ఆరంభమ్యాచ్‌లో భారత్‌ ఆదరగొట్టింది. రోహిత్‌ శర్మ తన ఫామ్‌ని కొనసాగించాడు. బుమ్రా, చాహాల్‌ బంతితో మాయ చేశారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ.. భారత్‌ ఓ అలవాటును మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆటను తొందరగా ముగించకపోవడం. ప్రత్యర్థి టెయిలెండర్ల తోకను కట్‌ చేయకపోవడం.

చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో బుమ్రా అంచనాలకు తగ్గట్టుగానే రాణించాడు. దక్షిణాఫ్రికాను ఇబ్బందిపెట్టాడు. ఆదిలోనే రెండు వికెట్లు తీశాడు. 24 పరుగులకే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కుల్దీప్‌తో కలిసి చాహాల్‌ మాయ చేశాడు. వీరిద్దరీ స్పిన్‌ మంత్రానికి సౌతాఫ్రికా మరో మూడు వికెట్లు కోల్పోయింది. 89 పరుగులకే ఐదు వికెట్లు పడ్డాయి. ఇక్కడే పట్టు బిగించాల్సిన భారత్‌… అదే ఉదాసీనత ప్రదర్శించింది. చివర వరస బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టుకుంది. అప్పటికే ఆత్మరక్షణలో పడిపోయిన దక్షిణాఫ్రికాపై మరింత పట్టు బిగించాల్సింది. 23 ఓవర్లకు సగం వికెట్లు కోల్పోయి వంద పరుగులు కూడా చేయని సౌతాఫ్రికా చివరకు 227 పరుగులు చేసింది. సగం వికెట్లు కోల్పోయినా.. దక్షిణాఫ్రికా మరో 138 పరుగులు జత చేసింది.

సరే.. ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ బ్యాట్స్‌మెన్‌ ఏకాగ్రతతో ఆడారనుకుంటే.. సౌతాఫ్రికాను ఆలౌట్‌ చేయలేకపోయింది. 158 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన స్థితిలోనూ.. భారత్‌ బలహీనతలు బయటపడ్డాయి. చివరి పదిఓవర్లలో మరో రెండు వికెట్లు మాత్రమే భారత బౌలర్లు పడగొట్టారు. అందులో ఒకటి చివరి ఓవర్‌ ఆఖరి బంతికి దక్కింది. మొత్తం మీద పది ఓవర్లలో దక్షిణాఫ్రికా 69 పరుగులు చేసింది. భారత్‌, దక్షిణాఫ్రికాను కనీసం ఆలౌట్‌ కూడాచేయలేకపోయింది.

ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు బలహీనంగా ఉంది. ఒకప్పటి జట్టే అయితే.. భారత బలహీనతలను సొమ్ముచేసుకుని 300 పరుగులైనా కొట్టేది. అంతేందుకు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై మన బౌలింగ్‌ తీరు ఇలాగే ఉంటే మాత్రం.. ప్రపంచకప్‌లో భారత్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు.