20 ఏళ్ళుగా తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. మదిలో మెదలే తొలిప్రశ్న.  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ సారి పోటీ చేస్తారా..? అని. ఈ ప్రశ్నలకు ఎప్పటికప్పుడు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుతున్నారు… రజనీ. దేవుడు ఆదేశిస్తాడు… నేను పాటిస్తాను అని చెప్పేవారు. కొన్నిసార్లు తన మద్దతు ఎవరికో బహిరంగంగానే వెల్లడించేవారు. లేదంటే మౌనంగా ఉండిపోయేవారు. ఈ సారి ఎన్నికల్లోనూ మౌనంగానే ఉన్నారు. మరోవైపు తన సహనటుడు కమల్‌హాసన్‌ పార్టీ పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో నిలిచారు. అప్పటినుంచి రజనీ ఎటుపోయినా… ఒకటే ప్రశ్న. రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడూ అని..? ఈ ప్రశ్నకు రజనీ మరోసారి స్పష్టమైన సమాధానమే చెప్పారు.

వచ్చే తమిళనాడు అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు పోటీ చేస్తానని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల బరిలో నిలుస్తానని.. మీడియాకు ఇవాళ చెప్పారు. మరోవైపు ఓ తమిళటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన రజనీ సోదరుడు సత్యనారాయణ ఆసక్తికర విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఈ నెల 23న రజనీ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిత్వానికి రజనీ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి ఓటు వేసి దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికల సమయంలో బీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపినప్పటికీ రజనీ మౌనంగానే ఉండిపోయారు. ఈ నెల 23న ఫలితాల ఆధారంగా రజనీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటురా లేక ఒంటరిగా వెళ్తారో తేలనుంది.

ప్రస్తుతం రజనీ ఎ.ఆర్‌. మురగదాస్‌ దర్శకత్వంలో దర్బర్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. నయనతార కథానాయిక. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న దర్బార్‌… 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Tamil Super Star Rajni Kanth Again Clarify On His Political Entry. He Will Contest Tamilnadu Assembly Elections. He may Take A Important Decision On May 23rd.