మాస్‌ యాక్షన్‌ హీరో నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి ఓ టాక్‌ షో చేయబోతున్నారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా కోసం అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే పేరుతో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. సినిమాల్లో ప్రయోగాలకు పెద్దపీట వేసే బాలయ్య ఈసారి డిజిటల్‌ మీడియాలోనూ ప్రయోగానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ షో కోసం నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అరవింద్‌ అన్‌స్టాపబుల్‌ షోపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో రూపొందించిన యాడ్స్‌ జనాలను ఆకట్టుకుంటున్నాయి.


అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకేలో బాలకృష్ణ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనున్నారు. వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా షో నిర్వహించాలని డిసైడ్‌ అయాయరు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్‌ షూటింగ్‌ పూర్తైనట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా నవంబర్‌ 4 నుంచి అన్‌స్టాపబుల్‌ ప్రీమియర్‌ కానుంది. ఇదిలా ఉంటే బాలయ్య టాక్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా ఎవరు రానున్నారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీనిపై సోషల్‌ మీడియాలో పలు వార్తలు హల్చల్‌ చేస్తున్నాయి. సీనియర్‌ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఫస్ట్‌ గెస్ట్‌గా అన్‌స్టాపబుల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. బాలయ్య, మోహన్‌ బాబు కలిసి ఒక షోలో కనిపించడం ఇదే తొలిసారి.


బాలయ్య టాక్‌ షోలో మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌తో కలిసి పాల్గొనే అవకాశమున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అల్లు అరవింద్‌ ఓటీటీలో ప్రసారమవుతున్న కార్యక్రమం కావడంతో చిరు కూడా ఇంటర్వ్యూకు ఓకే చెప్పవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సినీ తారలే కాకుండా దర్శక నిర్మాతలను కూడా టాక్‌ షోలో భాగస్వాములను చేసినట్లు తెలుస్తోంది.