టాలీవుడ్లో ప్రస్తుతం మూడో తరం హవా నడుస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్కినేని నాగచైతన్య, అఖిల్, రానా దగ్గుబాటి ఇలా చాలా మంది హీరోలు వారసత్వంలో పరిశ్రమలో అడుగుపెట్టి హీరోలుగా నిలదొక్కుకున్నారు. తాతలు, తండ్రుల అండదండలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తమ నటనతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. ఈ అగ్రహీరోల వారసులను సైతం వెండితెరపై చూడాలనుకుంటున్నారు ఆడియెన్స్. ఇప్పటికే కొందరు హీరోల బిడ్డలు తెరపై తళుక్కున మెరవగా.. మరికొందరు త్వరలోనే తెరంగేట్రం చేయనున్నారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరానందన్. ఇతనికి చదవుతో పాటు యాక్టింగ్‌పై కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఈ విషయాన్ని తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో చెప్పారు. వెండితెరపై అకీరా ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్‌గా అకీరా ఎంట్రీ ఎప్పుడో జరిగిపోయింది. తల్లి రేణు దేశాయ్ డైరెక్ట్ చేసిన ఇష్కవాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. ప్రస్తుతం యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న అకీరా.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు మహేశ్‌బాబు. తండ్రి బాటలోనే పయనిస్తూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు గౌతమ్. మహేశ్ హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాలో బాల నటుడిగా సిల్వన్ స్క్రీన్‌పై మెరిశాడు. సినిమాలో మహేశ్‌బాబు చిన్నప్పటి పాత్ర పోషించాడు. ఫ్యూచర్లో తను సినీ ఇండస్ట్రీలోకి వస్తాడా లేదా అన్న నిర్ణయాన్ని పేరెంట్స్ గౌతమ్‌కే వదిలేశారు. ఇక మహేశ్ గారాలపట్టి సితారకు కూడా నటన అంటే ఆసక్తి. డ్యాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టం. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సితార ఇప్పటికే చాలా మందికి దగ్గరైంది. హాలీవుడ్ చిత్రం ఫ్రోజన్ 2లో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అల్లు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం ఆర్టిస్ట్‌ల ఎంట్రీ కూడా ఖరారైపోయింది. మూడో తరానికి చెందిన బన్నీ, అల్లు శిరీష్‌లు ఇప్పటికే టాలీవుడ్లో హీరోలుగా కొనసాగుతుండగా.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దువ్వాడ జగన్నాథం ఆడియో లాంఛ్ సమయంలో వేదికపై ఈ బుడతడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వేదిక ఎక్కగానే ఆడియెన్స్‌కు అభివాదం చేయడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అయాన్ కన్నా ముందే బన్నీ గారాలపట్టి అర్హా రేసులో దూసుకుపోయింది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హా భరతుడిగా నటించింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
ఇక నందమూరి వంశం నుంచి కూడా నాలుగో తరం వారసులు వెండి తెరను ఏలేందుకు సిద్ధమయ్యారు. 1991లో జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడి పాత్రలో తొలిసారి బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ తనయుడు అభయ్‌రామ్‌ను కూడా వెండితెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారు. హైపర్ యాక్టివ్ కిడ్ అయిన అభయ్‌ను త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలంలో భరతుని పాత్ర కోసం మొదట అభయ్రామ్నే అనుకున్నారట. కానీ ఆ అవకాశం అల్లు అర్హాకు దక్కింది. అయితే ఆ సినిమాలో మరో చైల్డ్ ఆర్టిస్ట్‌కు స్కోప్ ఉండటంతో ఆ పాత్రకు అభయ్‌ను తీసుకున్నట్లు సమాచారం. శాకుంతలం సినిమా రిలీజైన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ బాలల చిత్రంతో ఇప్పటికే వెండితెరపై కనిపించాడు. కల్యాణ్‌రామ్ తనయుడు శౌర్య రామ్ కూడా ఇజం సినిమాతో బాల నటుడిగా పరిచయమయ్యాడు.
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా ఎదిగాడు రవితేజ. తాజాగా ఆయన తనయుడు మహాధన్ కూడా సిల్కర్ స్క్రీన్‌పై కనిపించాడు. రాజా ది గ్రేట్ సినిమాలో తళుక్కుమన్నాడు. చదువు పూర్తైన తర్వాతే మహాధన్ సినిమాల్లోకి వస్తాడని రవితేజ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక దర్శకుల వారసుల విషయానికొస్తే పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగాడు. ఇతడు నటించిన రొమాంటిక్ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనయుడు కూడా క్రాక్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.