సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కంటిన్యూ అయ్యేలా చూసుకోవడం అంత ఈజీ కాదు. ఏళ్ల తరబడి కాదు.. ఏకంగా దశాబ్దాల పాటు హీరోలుగా కొనసాగడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ టాలీవుడ్‌లో
మాత్రం ఓ నలుగురు హీరోలు తాము ఎవర్‌ గ్రీన్‌ అని నిరూపించుకుంటున్నారు. మధ్యలో గ్యాప్‌ వచ్చినా మళ్లీ ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చి కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రెండోతరం వారసులుగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌కు పిల్లర్స్‌గా మారారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌. 80వ దశకం నుంచి 2000 వరకు టాలీవుడ్‌లో వీరిదే డామినేషన్‌. 2000 తర్వాత కొత్త హీరోల ఎంట్రీ మొదలైంది. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు తదితర హీరోల రాకతో సీనియర్ల స్పీడ్‌ కొంచెం తగ్గింది. కానీ గత మూడు నాలుగేళ్లుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంటకటేశ్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యారు. వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు.


పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన చిరంజీవి.. ఖైదీ నంబర్‌ 150తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సైరా సినిమాతో మెప్పించిన మెగాస్టార్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. కొడుకు రాం చరణ్‌తో కలిసి కొరటాల శివ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మలయాళ సూపర్‌ హిట్‌ లూసీఫర్‌కు రీమేక్‌గా కోలీవుడ్‌ డైరెక్టర్‌ మోహన్ రాజా డైరెక్షన్‌లో గాడ్‌ ఫాదర్‌లో చిరంజీవి కథానాయకునిగా నటిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు కోలీవుడ్‌ మరో సూపర్‌ హిట్‌ వేదాళం తెలుగు రీమేక్‌గా మెహర్‌ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్‌లోనూ చిరు కనిపించనున్నారు.


నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్‌ బేస్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఒకవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు వరుస సినిమాలతో అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన అఖండ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. మూవీ మేకర్స్ త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసే అవకాశముంది. అఖండ షూటింగ్‌ ముగియడంతో తొలి తెలుగు ఓటీటీ ఆహా కోసం అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే పేరుతో టాక్‌ షో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అఖండ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు బాలయ్య ఇప్పటికే ప్రకటించారు. బాలయ్య అనే టైటిల్‌తో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లనుంది. దీంతో పాటు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో సినిమాకు బాలకృష్ణ ఓకే చెప్పారు. ఇక పూరీ జగన్నాథ్‌తో కలిసి పైసా వసూల్‌ సినిమా చేసిన బాలయ్య ఆయనతో మరో మూవీకి రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పూరీతో చేయనున్న ఈ సినిమాతో కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.


అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్‌ ఎఫ్‌ 2 సూపర్‌ హిట్‌ కావడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు వెంకటేశ్‌. F2 తర్వాత మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీమామలో నటించిన ఆయన.. వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఓటీటీ వేదికగా రిలీజైన నారప్పలో మెయిన్‌ లీడ్‌ పోషించి తన నటనకు అందరి ప్రశంసలు అందుకున్నాడు. రీమేక్‌ కంటెంట్‌ అయినప్పటికీ యాక్టింగ్‌, డైలాగులతో ప్రేక్షకుల్ని కట్టి పడేశాడు. ఇక F2కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న F3తో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యాడు వెంకీ. ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినా సంక్రాంతికి రిలీజ్‌ కావచ్చని టాక్‌ వినిపిస్తోంది. దీంతో పాటు 2014లో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న దృశ్యం 2లోనూ నటించారు వెంకటేశ్‌. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. F3, దృశ్యం 2 సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తారా లేక నారప్పలాగే ఓటీటీలో విడుదల చేస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.


తెలుగు ఇండస్ట్రీలో సీనియర్‌ హీరో టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున. ఈయన కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 1986లో విక్రం మూవీతో తెరంగేట్రం చేసిన నాగార్జునకు మూడు దశాబ్దాల తర్వాత కూడా మంచి మార్కెట్‌ ఉంది. కొన్ని సినిమాలైతే బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. 2019లో వచ్చిన మన్మథుడు 2 తర్వాత ఆయన నటించిన వైల్డ్‌ డాగ్‌ మూవీ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం నాగార్జున ఘోస్ట్‌ సినిమాతో పాటు బంగార్రాజు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బంపర్‌ హిట్టైన సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోంది. ఇందులో కొడుకు నాగ చైతన్యతో కలిసి నాగార్జున స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు. మొత్తమ్మీద వరుస సినిమాలతో దూసుకుపోతున్న సీనియర్‌ హీరోలు కుర్ర కథానాయకులకు గట్టిగానే పోటీ ఇస్తున్నారు. మరి వీరి హవా ఇంకెన్నేళ్లు కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.