సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు హిట్టైతే ఆ దర్శకున్ని టాప్‌ డైరెక్టర్‌ అంటారు. కానీ చేసిన సినిమాలన్నీ బంపర్‌ హిట్టైతే జక్కన్న అంటారు. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్‌. అందుకే అందరూ టాలీవుడ్‌ జక్కన్న అని పిలుచుకుంటారు. కథలో కొత్తదనం, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లేతో సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఘనత రాజమౌళి సొంతం. రావడం ఆలస్యమైనా.. రాజమౌళి సినిమా రేంజ్‌ వేరేలా ఉంటుందన్నది ప్రేక్షకుల నమ్మకం. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌తో మొదలైన రాజమౌళి ప్రస్థానం సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, ఈగ, మగధీర, బాహుబలి వరకు సాగింది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


రాజమౌళి సినిమా అంటేనే ఫ్యామిలీ ప్యాక్‌. ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన కుటుంబ సభ్యులందరూ కష్టపడతారు. దీని వెనుక కారణం లేకపోలేదు. తొలినాళ్లలో రాజమౌళి కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుకు వారికి శ్రమ విలువ తెలియజేశాయి. అందుకే సినిమాకు అంతా తామే, అన్నీ తామై అన్నట్లుగా అలుపెరగకుండా పనిచేస్తారు. టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం. కీరవాణి రాజమౌళి పెద్దనాన్న కొడుకు. రాజమౌళి – కీరవాణి కుటుంబంలో చాలా మంది ప్రతిభావంతులున్నారు. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రచయిత. రాజమౌళి సినిమాలన్నింటికీ స్వరాలు సమకూర్చేది సోదరుడు కీరవాణి. ఇక రాజమౌళి సతీమణి రమా కస్ట్యూమ్‌ డిజైనర్‌ కాగా. కీరవాణి భార్య శ్రీవల్లి లైన్‌ ప్రొడ్యూసర్‌గా సేవలందిస్తుంటారు. జక్కన్న కొడుకు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈగతో పాటు బాహుబలి మూవీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. రాజమౌళి భార్య రమా, కీరవాణి సతీమణి శ్రీవల్లి ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్లు కావడం విశేషం.


రాజమౌళి పుట్టింది కర్నాటకలోని రాయచూర్‌ అయినా పెరిగింది మాత్రం కొవ్వూరులో నాన్నమ్మ దగ్గర. చిన్నప్పటి నుంచి కథలు చెప్పడమంటే రాజమౌళికి ఆసక్తి. 7వ తరగతి నుంచి 10 వరకు ఏలూరులో మేనత్త దగ్గర చదువుకున్నాడు. ఇంటర్‌కు వచ్చేసరికి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రచయితగా నిలదొక్కుకుని చెన్నైలో స్థిరపడటంతో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి అక్కడ వాలిపోయాడు. అప్పటికే కీరవాణి బిజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. శ్రీవల్లితో పెళ్లి కూడా జరిగింది. రాజమౌళి రోజూ కీరవాణి స్టూడియోకు వెళ్లేవాడు. ఇంతకీ లైఫ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నాంటూ ఒక రోజు వదిన శ్రీవల్లి అడిగిన ప్రశ్నతో జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లు తండ్రి దగ్గర అసిస్టెంట్‌ గా చేసిన తర్వాత దర్శకేంద్రుడు రాఘవేందర్‌రావు వద్ద సహాయకుడిగా చేరాడు. 2002లో వచ్చిన స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ సినిమాతో డైరెక్టర్‌ మారి తొలిసారి మెగా ఫోన్‌ పట్టాడు రాజమౌళి. ఆ మూవీ తర్వాత ఏడాది గ్యాప్‌ వచ్చినా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న.


విజయేంద్ర ప్రసాద్.. చాలా మందికి డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రిగానే తెలుసు. రాజమౌళి సినిమాలకు మాత్రమే ఆయన కథ అందిస్తారని అనుకుంటారు. కానీ జక్కన్న సినిమాల్లోకి రాకముందు నుంచే విజయేంద్ర ప్రసాద్‌ పేరున్న సినీ రచయిత. ఆయన పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్‌. 35 ఏళ్ల క్రితమే సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. పలు చిత్రాలకు కథ అందించడంతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. పెద్దన్న శివశక్తి దత్త స్ఫూర్తితోనే తాను కథలు రాయడం మొదలుపెట్టిన విజయేంద్రప్రసాద్‌ కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు., ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన సమయంలో కీరవాణి అండగా నిలిచి ఆదుకున్న విషయం ఎప్పటికీ మరిచిపోనంటారాయన.


జానకి రాముడు, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సమరసింహారెడ్డి, విజయేంద్ర వర్మ, మిత్రుడు, రాజన్న సినిమాలకు విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సింహాద్రి, సై, విక్రమార్కుడు, యమదొంగ, ఛత్రపతి, మగధీర, బాహుబలితో పాటు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆయన కథతోనే తెరకెక్కాయి. కెరీర్‌ ప్రారంభం నుంచి ఎన్నో హిట్‌ సినిమాలకు కథ అందించినా కొడుకు రాజమౌళి సినిమాలకు అందించిన కథలతోనే ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. ప్రభాస్‌ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌తో పాటు మరో పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న సీత మూవీ కూడా విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతోనే రూపుదిద్దుకుంటున్నాయి. బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ మణికర్ణికకు విజయేంద్ర ప్రసాద్‌ కథ ఇచ్చారు. ఈ సినిమా 150 కోట్లు రాబట్టింది. ఇక బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన భజరంగీ భాయిజాన్‌ కు కథ అందించింది విజయేంద్ర ప్రసాదే. ఈ సినిమా కలెక్షన్‌లు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఈ సినిమా 969 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. పలు తమిళ సినిమాలకు సైతం పనిచేశారు. ఆయన రాసిన స్టోరీతో తెరకెక్కిన మెర్సిల్‌ మూవీ 260 కోట్లు రాబట్టింది.


విజయేంద్ర ప్రసాద్‌ అన్న బాహుబలి ది బిగినింగ్‌ లో మమతల తల్లి పాట రాసిన శివశక్తి దత్త కుమారుడు ఎంఎం కీరవాణి. సంగీతం మీద ఉన్న మక్కువతో రాగాల్లో ఒకటైన కీరవాణిని కొడుకు పేరుగా పెట్టుకున్నాడు. ఆయన పూర్తి పేరు మరకతమణి కీరవాణి. తొలినాళ్లలో కీరవాణి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 1989 సమయంలో కీరవాణి కుటుంబం చెన్నైలోని డబుల్‌ బెడ్‌ రూం ఇంట్లో ఉండేది. అప్పట్లో తల్లిదండ్రులతో పాటు ముగ్గురు బాబాయ్‌ల ఫ్యామిలీలకు కూడా కీరవాణే ఆధారం. మ్యూజిక్‌ అసిస్టెంట్‌గా పనిచేసినందుకుగానూ రోజుకు వచ్చే రూ.200లతో వారందరి అవసరాలు తీర్చాడు. ఇలా దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిభను, కష్టాన్ని నమ్ముకుని తన సంపాదనతో కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. సంగీత దర్శకుడిగా మారకముందు చక్రవర్తి దగ్గర రెండేళ్లు పని చేసిన కీరవాణి.. ఆ తర్వాత గేయ రచయిత వేటూరి దగ్గర శిష్యరికం చేశాడు.


చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలోనే కేవలం సెలెక్టివ్‌ సినిమాలు మాత్రమే చేయాలనుకున్నాడు కీరవాణి. ఏడాదికి ఓ ఐదు సినిమాలు చేస్తే చాలని భావించాడు. కానీ కుటుంబ పరిస్థితులు కీరవాణిని పరుగులు పెట్టించాయి. 1994లో ఏకంగా 16 సినిమాలకు పనిచేశాడు. తాను మ్యూజిక్‌ డైరెక్టరైన మరుసటి ఏడాది నుంచే సగటున 10 సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పటి వరకు 200లకు పైగా సినిమాలకు బాణీలు కట్టారు. మాతృదేవోభవ సినిమాలో రాలిపోయే పువ్వా పాటకు తొలిసారి గాత్రం అందించారు కీరవాణి. ఆ తర్వాత సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, శ్రీరామదాసు, బాహుబలి సినిమాల్లో పాటలకు గొంతు విప్పారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సినిమాలకు పాటలు పాడారు. రాజమౌళి తీసిన స్టూడెంట్‌ నెంబర్‌ 1 నుంచి సంక్రాంతికి విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ప్రతి సినిమాకు కీరవాణే సంగీత దర్శకుడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వచ్చినవన్నీ సూపర్‌ హిట్లే.


కన్నబిడ్డలకు డబ్బు విలువ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇద్దరు కొడుకులను నగర శివార్లలోని ఓ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి పని చేయించాడు కీరవాణి. రోజంతా కష్టపడ్డ తర్వాత వారికి రూ. 50 ఇచ్చాడు. పెద్ద కుమారుడు కాలభైరవ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా కొనసాగుతున్నాడు. చిన్న కొడుకు శ్రీ సింహ ఇప్పటికే మత్తు వదలరా సినిమాతో హీరోగా హిట్‌ కొట్టాడు.