జక్కన్న చెక్కిన మల్టీస్టారర్‌ ఆర్ఆర్‌ఆర్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022 జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. రాజమౌళి అనూహ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను సంక్రాంతి బరిలో దింపడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటికే బెర్త్‌లు కన్ఫామ్‌ చేసుకున్న పెద్ద సినిమాలు వెనకడుగు వేశాయి. తాజాగా కొన్ని చిత్రాలు తమ సినిమా రిలీజ్‌ డేట్స్‌ను మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


సంక్రాంతికి పవన్‌ – రానా మల్టీస్టారర్‌ భీమ్లానాయక్‌తో పాటు మహేశ్ బాబు నటించిన సర్కారువారి పాట, ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. వెంకటేశ్‌ – వరుణ్‌ తేజ్‌ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎఫ్‌ 3ను కూడా జనవరిలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్ చేశారు. అయితే బాహుబలి తర్వాత అంత క్రేజ్‌ ఉన్న సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమాతో పోటీని తట్టుకోగలమా అన్న సంశయంతో మిగతా చిత్రాల దర్శక నిర్మాతలు గేమ్‌ ప్లాన్‌ మార్చుకుంటున్నారు.


వెంకటేశ్ – వరుణ్‌ తేజ్‌ నటించిన ఎఫ్‌ 3 రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మూవీమేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాను ఫిబ్రవరి 25కు షిఫ్ట్‌ చేశారు. తాజాగా భీమ్లా నాయక్‌, సర్కారువారి పాట కూడా అదే దారి పట్టనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సర్కారు వారి పాటను సమ్మర్‌కు పోస్ట్‌పోన్‌ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక భీమ్లా నాయక్‌ను జనవరి 26 లేదా ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదీ కుదరని పక్షంలో ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్మాతలు భావిస్తున్నారట.


ఇక ఆర్‌ఆర్‌ఆర్‌కు పోటీగా ఉన్న ఒకే ఒక్క సినిమా రాధేశ్యామ్. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్‌లోనూ జనవరి 14న విడుదల అంటూ యూవీ క్రియేషన్స్‌ స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈసారి ఛాన్స్‌ తీసుకోకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ జనవరి 7, రాధేశ్యామ్‌ 14న రిలీజ్‌ కానున్నాయి. రెండింటి విడుదలకు మధ్య వారం గ్యాప్‌ ఉన్నందున రాధేశ్యామ్‌ బరి నుంచి తప్పుకోకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్‌ జోరుగా సాగింది. థియేట్రికల్‌, డిజిటల్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయాయి. సినిమా హక్కులను సొంతం చేసుకున్న బయ్యర్స్‌.. ఇప్పుడు డైలమాలో పడ్డారు. సెకండ్‌ వేవ్‌ భయాలు తగ్గినా ఒక సెక్షన్‌ ఆడియెన్స్‌ ఇంకా థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు సినిమా థియేట్రికల్‌ రిలీజైన నెలా రెండు నెలలకే ఓటీటీలోకి వచ్చేస్తుండటం చాలా మంది థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు ఏపీలో టికెట్‌ రేట్లు తగ్గువగా ఉండటం బయ్యర్స్‌ను పునరాలోచనలో పడేసింది. ఈ క్రమంలో వారంతా మూవీమేకర్స్‌ ముందు కొత్త ప్రతిపాదన పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డీల్‌ మొత్తంలో 30శాతం వెనక్కి ఇవ్వాలన్నది వారి డిమాండ్‌. ఈ అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మూవీ మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే తేలనుంది.