కింగ్‌ నాగార్జున, తనయుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ బంగార్రాజు. కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సూపర్‌ హిట్‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్‌గా బంగార్రాజు సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగ్‌కు జోడీగా మరోసారి రమ్యకృష్ణ కనిపించనుండగా.. ఉప్పెన భామ కృతి శెట్టి నాగ చైతన్యతో జోడీ కట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ కల్లా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


2016 సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. ఆ ఏడాది నాగ్‌ సినిమానే హయ్యెస్ట్‌ గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. అదే సెంటిమెంట్‌తో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్‌ అయిన బంగార్రాజును సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి భారీ చిత్రాలు ఎప్పుడో బెర్తులు కన్ఫామ్ చేసుకున్నాయి. పాన్‌ ఇండియా మూవీలైన తారక్‌ – చెర్రీల ట్రిపుల్‌ ఆర్‌, ప్రభాస్‌ రాధేశ్యామ్, పవన్‌ కల్యాణ్‌ – రానా నటించిన భీమ్లా నాయక్‌, మహేశ్‌బాబు సర్కారు వారి పాట సినిమాలు ఆల్రెడీ రిలీజ్‌ డేట్స్‌ లాక్‌ చేసుకున్నాయి. నాలుగు భారీ చిత్రాలు బరిలో ఉన్నందున బంగార్రాజు సింగిల్‌ రిలీజ్‌కు డేట్‌ దొరికే అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిత్రాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.


అక్కినేని నాగార్జున, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మనం సినిమా తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అక్కినేని అభిమానులు బంగార్రాజు మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రావు రమేష్, చలపతి రావు, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌ ఝాన్సీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చుతున్నారు.