పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్‌ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్‌ వచ్చాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వింటేజ్‌ లవ్‌ స్టోరీ రాధే శ్యామ్‌కు సంబంధించి మూవీ మేకర్స్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్య లుక్‌ను ఇప్పటికే రివీల్‌ చేశారు. తాజాగా టీజర్‌లో విక్రమాదిత్య ఎవరన్న విషయంపై స్పష్టత ఇచ్చారు. పాన్‌ ఇండియా మూవీ అయినప్పటికీ ఒకే భాషలో టీజర్‌ రిలీజ్‌ చేయడం విశేషం.


”నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ చావు గురించి తెలిసినా.. నీకు చెప్పను.. ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు.. నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు.. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.


‘రాధే శ్యామ్’ టీజర్‌ను గమనిస్తే అది కేవలం లవ్ స్టోరీయే కాదని అర్థమవుతోంది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించనున్నాడు. సైన్స్‌కి జ్యోతిష్యాన్ని లింక్ చేస్తూ ఈ వింటేజ్‌ ప్రేమ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పాటు చైనీస్‌, జపనీస్‌ భాషల్లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్‌ చేయనున్నారు.


మరోవైపు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ప్రాజెక్ట్‌ కే టీం ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పింది. సినిమాకు కొత్త సహస్రాబ్దిని తెచ్చిన సూపర్‌ హీరో, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు శుభాకాంక్షలు. ప్రాజెక్ట్‌ కె సెట్స్‌కి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మూవీ మేకర్స్‌ సూపర్‌ హీరో అనే పదాన్ని ఉపయోగించినందున ఇందులో ప్రభాస్‌ సూపర్‌ హీరోగా కనిపించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ జోనర్‌లో ప్రాజెక్ట్‌ కె రూపుదిద్దుకుంటోంది.