ఫీల్ గుడ్‌ మూవీలకు కేరాఫ్‌ శేఖర్‌ కమ్ముల. ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాలు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాయి. అందమైన ప్రేమకథలను ఆకట్టుకునేలా చెప్పే శేఖర్‌ కమ్ముల తాజాగా లవ్‌స్టోరీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్కినేని నాగచైతన్య – నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి నటించిన  ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.


వాస్తవానికి లవ్‌ స్టోరీ ఎప్పుడో రిలీజ్‌ కావాల్సి ఉండగా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. వినాయక చవితికి రిలీజ్‌చేద్దామనుకున్నా టక్‌ జగదీశ్‌ ఓటీటీ రిలీజ్‌, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంతో వెనక్కి తగ్గింది. దీంతో డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కొన్ని ఎపిసోడ్లను రీషూట్‌ చేసి ప్రేమకథను మరింత అందంగా తీర్చిదిద్దారు. ఎట్టకేలకూ ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న చైతూ – సాయిపల్లవి సెప్టెంబర్‌ 24న ఫ్యాన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యారు.


లవ్‌స్టోరీ చిత్రయూనిట్‌ ఈ మధ్యనే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల లైకులు.. రెండు రోజుల్లోనే 6.5మిలియన్‌ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. అయితే ఈ ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ ఇప్పుడు వివాదానికి కారణమైంది. హీరో లోన్‌ కోసం వెళ్లనప్పుడు బ్యాంక్‌ మేనేజర్‌తో జరిపే సంభాషణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెలోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలనే మేపుతాడు.. రిక్షావాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌పై అధికారపార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాన్ని కించపరిచేలా డైలాగ్స్‌ ఉన్నాయంటూ ఫైర్‌ అవుతున్నారు. ప్రతి ఒక్కడూ ప్రభుత్వాన్ని విమర్శించేవాడే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.


సెప్టెంబర్‌ 24న రిలీజ్‌ కానున్న లవ్‌స్టోరీలో నాగచైతన్య మధ్య తరగతి యువకుడి పాత్ర పోషించాడు. ఫ్యామిలీ కోసం పట్నం వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతిగా సాయిపల్లవి అలరించనుంది. లవ్‌స్టోరీ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌రావు నిర్మించారు. సినిమాలో సారంగదరియా పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్‌ చేసింది.