పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ పెద్ద కొడుకు అకీరా నందన్‌ టాలీవుడ్‌ ఎంట్రీపై చాలకాలంగా చర్చ నడుస్తోంది. అకీరాను వెండితెరపై చూసేందుకు పవన్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడే సమయం దగ్గర పడింది. త్వరలోనే అకీరా.. అబిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నాడు. తాను తెరంగేట్రం చేయడమే కాదు.. తండ్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్‌ డెబ్యూతో పాటు మొదటి సినిమాలోనే తండ్రితో కలిసి నటించి అకీరా డబుల్‌ ట్రీట్‌ ఇస్తున్నాడని పవన్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామా హరిహర వీరమల్లులో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 60శాతం షూటింగ్‌ పూర్తైన ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పవన్‌ తనయుడు అకీరా నందన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ రోల్‌ కోసం అకీరా కర్రసాము నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.


హరిహర వీరమల్లులో తండ్రి పవన్‌తో కలిసి అకీరా సందడి చేయనున్నాడు. దీనికి సంబంధించి మూవీ మేకర్స్ ఇంకా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేయనప్పటికీ ఈ వార్త మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. హరిహర వీరమల్లులో పవన్‌ సరనస నిధి అగర్వాల్‌, జాక్విలిన్‌ ఫెర్నాండెస్‌ కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి సైతం కొడుకు రాం చరణ్‌తో కలిసి మల్టీస్టారర్‌ ఆచార్యలో నటిస్తున్నారు. గతంలో చెర్రీ సినిమాల్లో చిరు గెస్ట్‌ రోల్‌లో కనిపించినా పూర్తి స్థాయిలో వారిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.