” ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు కుటుంబాల మధ్య ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయి” అంటూ.. కొన్నేళ్ళుగాసోషల్ మీడియాలో ప్రచారం షికార్లు చేస్తూనే ఉంది. 2009లో బిల్లా సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జోడి ఆ తర్వాత మిర్చి సినిమాలో ఈడు జోడుగా అలరించారు. ఇక బాహుబలి చిత్రంలో ఈ కాంబినేషన్ ఏ స్థాయి హిట్ అయిందో అందరికి తెలిసిందే. చూడ చక్కని జంటగా గుర్తింపు పొందిన ప్రభాస్‌, అనుష్క ముచ్చటగా మూడు ముళ్ళతో ఒక ఇంటి వారు కానున్నారని అభిమానులు సోషల్ మీడియాలో మురిసిపోయారు. ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ ఇద్దరి అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకున్నారనే చెప్పాలి.

ప్రభాస్ అనుష్క పేర్లను కలుపుతూ ఇరువురినీ ప్రనుష్క అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. వివిధ ఫంక్షన్లలో వీరిద్దరూ చనువుగా, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న దృశ్యాలను, ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతుంటారు. అయితే ఇద్దరి మధ్య మంచి స్నేహం తప్ప ప్రేమ లేదంటూ ప్రభాస్ , అనుష్క తేల్చి చెప్పారు. తాజాగా ప్రభాస్‌, అనుష్కకు సంబంధించి ఓ వీడియో వైరలైంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బాహుబలి సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో స్టేజి మీద అనుష్క ప్రభాస్ కూర్చున్నారు. సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించిన తమన్నా ఇద్దరి మధ్యలో కూర్చుంది. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో చప్పట్లు కొట్టాలి అంటూ… అనుష్కకు చెప్పేందుకు ప్రభాస్ ప్రయత్నించాడు. కానీ అనుష్క ఇటు వైపు చూడడం లేదు. మధ్యలో ఉన్న తమన్నాకు చెప్పి అనుష్కకు చెప్పాల్సిందిగా ప్రభాస్ కోరాడు. సో అనుష్క, ప్రభాస్ మధ్య కూర్చుంటే ఇలాంటి చిక్కులు వస్తాయని… తమన్నా అర్థమైనట్టుగా ఉండిపోయింది. ఇదంతా చూస్తున్న అనుష్క.. చిరునవ్వులు చిందించింది.

ఈ వీడియోలో జరిగినదానికి, అభిమానులు ఆనందానికి మధ్య నిజాన్ని ప్రభాస్‌, అనుష్కలే చెప్పాలి. ఇప్పటికైతే.. ఎప్పటికప్పుడు వాళ్లిద్దరూ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు… తమ మధ్య ఏమీ లేదు అని. స్నేహం తప్ప మరేమీలేదని. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన అభిమానులు మాత్రం.. సరదా, సరదా కామెంట్లు పెడుతూ ఆనందపడిపోతున్నారు.