టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు మనసులో చోటు సంపాదించుకుంటున్నారు. ఒక్క హిట్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన హీరోయిన్లూ ఉన్నారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యూనరేషన్‌ తీసుకున్న కథానాయికలు ఇప్పుడు కోట్ల రూపాయలు ఛార్జ్‌ చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా క్రేజ్‌ ఉండగానే వీలైనంత సంపాదించుకుంటున్నారు.


హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. శ్రీరామరాజ్యంలో సీతగా నటించిన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమె.. చంద్రముఖిలో నటనతో అందిరినీ ఆకట్టుకుంది. నటనతో విపరీతమైన ఫ్యాన్‌బేస్‌ పెంచుకున్న నయన్‌.. అందుకు తగ్గట్లుగానే రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న నయనతార ఒక్కో మూవీకి రూ. 4 నుంచి రూ.6 కోట్లు ఛార్జ్‌ చేస్తోందట.


విలక్షణ పాత్రలకు కేరాఫ్‌ సమంత. ఫ్యామిలీ మేన్‌ 2 సీరిస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన సామ్‌ రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసింది. గతంలో ఒక్కో మూవీకి మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పారితోషికాన్ని 7 కోట్లకు పెంచేసిందని టాక్‌ వినిపిస్తోంది. సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్‌కు సిద్ధంకాగా.. త్వరలోనే మరికొన్ని ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.


టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగులో ఈమె హవా నడుస్తోంది. ఒకలైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస ఆఫర్లలో బిజీగా ఉంది. తాను నటించిన సినిమాలన్నీ హిట్టవుతుండటంతో పూజా ప్రస్తుతం ఒక్కో మూవీకి 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఛార్జ్‌ చేస్తోందట. ఇటీవలే విడుదలైన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకోగా.. ఆచార్యలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో రొమాన్స్‌ చేస్తోంది. ఇక ప్రభాస్‌ సరసన కనిపించి రాధేశ్యామ్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది.


హీరోయిన్‌గా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ రేసులో దూసుకుపోతోంది సాయిపల్లవి. తెలుగు, తమిళ్‌, మలయాళ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది. సాయి పల్లవి ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. నాగ చైతన్యతో నటించిన లవ్‌స్టోరీ సూపర్‌ హిట్‌ కాగా.. ప్రస్తుతం నాని సరసన శ్యామ్‌ సింగరాయ్‌లో నటిస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమాలో రానాతో జతకట్టింది ఈ నేచురల్‌ బ్యూటీ.


టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌తో సంబంధం లేకుండా తన టాలెంట్‌తో అద్దరగొడుతోంది రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె ఒక్కో సినిమాకు రెండున్నర నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తోంది. దీంతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోనూ ఆమె కనిపించనుంది.


మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది కీర్తి సురేశ్‌. స్టార్‌ హీరోయిన్‌ లిస్టులో చేరిన ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గతంలో ఒక్కో సినిమాకు రూ. 2కోట్ల వరకు ఛార్జ్‌ చేసిన కీర్తి.. ప్రస్తుతం రెమ్యూనరేషన్‌ను పెంచేసింది. తమిళ సూపర్‌ హిట్‌ వేదాళం తెలుగు రీమేక్‌ గాడ్‌ ఫాదర్‌లో మెగాస్టార్‌ చిరంజీవికి చెల్లెలిగా నటించేందుకు 3కోట్లు డిమాండ్‌ చేసిందట. ఆ పాత్రకు కీర్తి సురేష్ అయితేనే బాగుంటుందన్న కారణంగా మూవీ మేకర్స్‌ అంత మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారని టాక్‌ వినిపిస్తోంది.


తెలుగు ట్రెండింగ్‌ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు కృతి శెట్టి. తొలి సినిమా ఉప్పెనతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో ఫుల్‌ బిజీ అయిపోయింది. ఫస్ట్‌ మూవీకి ఆరు లక్షల పారితోషికం అందుకున్న కృతి శెట్టి.. నానితో నటిస్తున్న శ్యామ్‌ సింగరాయ్‌ కోసం 20లక్షలు డిమాండ్‌ చేసింది. సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్‌గా వస్తున్న బంగార్రాజులో నాగచైతన్య సరసన నటించేందుకు ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసిందట బేబమ్మ. పారితోషికం భారీగా పెంచేసినా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.