రాకుమారి, తోటరాముడిల ప్రేమకథలు తెలుగు సినిమాల్లో కోకొల్లలు. అలాంటి ఎన్నో చిత్రాలు కళాఖండాలుగా నిలిచి పోయాయి. ప్రేమకు అంతరాలు ఆటంకాలు కావని, కోట గోడలు అడ్డంకి కావని చాటి చెప్పే ఇతివృత్తాలు, కత్తుల వంతెనలను సైతం దాటుతూ సాగే కథాంశాలు ప్రేక్షకులకు సుపరిచితమే. తుపాకీ గొట్టాలకు ఎదురు నిలిచి, ప్రాణం కన్నా ప్రేమే మిన్నా అంటూ చాటి చెప్పిన ప్రణయ గాథలు కావ్యాలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే తెరకెక్కుతున్న చిత్రం ‘దొరసాని’ 1980వ దశకంలో తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన వాస్తవ ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన రాగా సోమవారం విడుదలైన ట్రైలర్ కు కూడా రెస్పాన్స్ బాగుంది.

ఒక ఊరిలో దొర కూతురు, కూలీ కొడుకు మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనే సన్నివేశాలను ఆకట్టుకునేలా వ్యక్తపరిచారు. మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై ఉత్కంఠ పెంచుతోంది. టైలర్ మొదట్లోనే హీరో జైలు నుంచి విడుదలై వస్తున్నట్టుగా చూపించారు. సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో సాగుతున్నట్టుగా అర్థమవుతోంది. హీరో హీరోయిన్లు పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకునే సన్నివేశాలు హృద్యంగా ఆవిష్కరించారు. వర్షం పడితే గొడుగు ఇవ్వడం, దాహం వేస్తే మీరు చేతికి అందివ్వడం ద్వారా దొరసాని ప్రేమను చూపుతుంది. కులం అడ్డు గోడలు కోటగోడల ఎత్తున నిలిచిన గ్రామం అది. అందుకే హీరోయిన్ నీరు అందించినా తాగడానికి హీరో సంశహిస్తాడు. ఫరవాలేదనో… పట్టింపులు లేవనో హీరోయిన్ చెబితే కృతకంగా ఉంటుంది. వారి మధ్య అన్యోన్యతకు అద్దం పట్టదు. అందుకే హీరోయిన్ హీరోకు ముద్దు పెట్టి తన ప్రేమ వ్యక్తపరుస్తుంది.

హీరోయిన్ తాను ఇష్టపడి కోట నుంచి తోట బాట పట్టినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముందుగా ఎవరి మనసులో పుట్టినా అది పేదల ప్రాణాన్నే బలి కోరుతుంది. ఈ సినిమాలో కూడా దొరసాని ప్రేమకు కూలీ కొడుకు దగ్గరవుతాడు. కానీ దొర అధికార దర్పంతో, పోలీసుల సాయంతో హీరోను ప్రాణం పోయేలా కొట్టిస్తాడు. అయితే సినిమా కథ ఇక్కడే మలుపు తిరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. పోలీసు లాకప్ లో ఓ నక్సలైట్ తో పరిచయం అతడి జీవితాన్ని ఎటువంటి మలుపులు తిప్పింది, జైలుకు ఎలా వెళ్లాడు. 30 ఏళ్ల పాటు జైలు జీవితం ఎందుకు అనుభవించాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత దొరసానిని కలిసాడా. అనే ఉత్కంఠను కలిగిస్తోంది.

కోటలోనే పంజరంలో చిలకలా బందీగా మారిన దొరసాని జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి. తన ప్రేమ కారణంగా కష్టాలు అనుభవించి తిరిగి ఊరికి వచ్చిన ప్రేమికున్ని కలుసుకుంటుందా. నిత్యం తమ చూపుల వారధిగా నిలిచిన కిటికీకి దొరసాని చున్ని కట్టి ఉంటుంది. అంటే తాను ఎదురు చూస్తూ ఉందా…? జ్ఞాపకం వదిలేసి వెళ్లిందా..? అనే ఉత్కంఠభరిత కథాంశం ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. హీరో హీరోయిన్లుగా ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ మంచి నటనను కనబరిచారు. విజయ్ దేవరకొండ తమ్ముడే ఆనంద్. హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక. ఆనంద్ దేవరకొండ నటనలో వివిధ భావాలను పలికించిన తీరు, సంభాషణలు పలికే విధానం ఆకట్టుకుంటోంది. తమ్ముడు కూడా ఏం తక్కువ లేడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కె.వి.ఆర్ మహేంద్ర రచన, దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతోంది. గోరటి వెంకన్న, రామజోగయ్య శాస్త్రి, శ్రేష్ట సాహిత్యం అందించగా ప్రశాంత్ ఆర్ విహారి స్వరాలు సమకూర్చారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. కన్నడ కిశోర్, వినయ్ వర్మ, శరణ్య, బైరెడ్డి వంశీ కృష్ణారెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మాతలుగా ధీరజ్ మొగిలి నేని సహ నిర్మాతగా, వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.