కొన్నాళ్ళుగా తెలుగు సినీ సంగీతంలో దేవిశ్రీ ప్రసాద్‌ వర్సెస్‌ తమన్‌ అన్నట్లుగా సాగుతోంది. ఈ రేసులో ఇటీవల డీఎస్పీ కాస్తా వెనకబడినట్లే కనిపిస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్యకి మణిశర్మ పనిచేస్తుండగా, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌సాబ్‌ని తమన్‌ దక్కించుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద్‌ చేతిలో ఒక్క భారీ మూవీకి కూడా ఇప్పుడు మ్యూజిక్‌ చేయడం లేదు. అయినా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోవడం అలవాటైన దేవీశ్రీ… బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. బాలీవుడ్‌లోకి భారీ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ రాధే సినిమాకు మ్యూజిక్‌ చేసే అవకాశం పొందాడు. దేవీశ్రీ సంగీతం అందించిన ఒకే ఒక్క పాట విని సల్మాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మహర్షి సినిమాలో చోటి చోటీ బాతే అంటూ సాగే స్నేహగీతం సల్మాన్‌కి బాగా నచ్చింది. బాలీవుడ్‌ సక్సెల్‌పుల్‌ సంగీత దర్శకులతో కలిసి పనిచేసేందుకు సల్మాన్‌ ఇష్టపడతాడు. గతంలో తన సినిమాలకు మ్యూజిక్‌ అందించిన హిమేష్‌ రేష్మియా, సాజిద్‌ – వాజిద్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఇద్దామనుకున్నాడు. కానీ.. రాధే సినిమా దర్శకుడు ప్రభుదేవా.. దేవిశ్రీ ప్రసాద్‌ పేరు సూచించాడట. వాటెండ్‌, దబాంగ్‌-3లాంటి మంచి విజయాలను అందించిన ప్రభుదేవా అంటే సల్మాన్‌కి మంచి గురి. సల్మాన్‌ నటించిన రెడీలో హిటైన డింకాచికా, జై హోలోని నాచోరే పాటకు ఓరిజినల్‌ మ్యూజిక్‌ ఇచ్చింది.. దేవీశ్రీనే అని గుర్తుచేశాడు. తన మాటపై నమ్మకంతో మహర్షి సినిమాలో చోటి చోటీ బాతే పాట విన్నాడు. ఆ మ్యూజిక్‌కి ముగ్దుడైపోయిన సల్మాన్‌.. ఇలాంటి సంగీతాన్నే తాను కోరుకుంటున్నానని చెప్పాడు. దేవీశ్రీని తన సినిమాకే ఓకే ఓకే చేశాడు.

ప్రభుదేవా దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా నువ్వోస్తానంటే నీనొద్దంటానాకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే. ఆ తర్వాత వీరిద్దరూ పౌర్ణమి, శంకర్‌ దాదా జిందాబాద్‌ సినిమాలకు కలిసి పనిచేశారు. బాలీవుడ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్ల సంగీతం రోటిన్‌గా ఉందని భావించిన ప్రభుదేవా.. ఈ సారి డీఎస్పీతో మ్యాజిక్‌ చేయించాలని గట్టిగానే నిర్ణయించున్నాడు.