తెలుగు సినిమా దశ, దిశను మార్చుకుంటోంది. అర్జున్‌రెడ్డి, పెళ్ళిచూపులు, మళ్ళీరావా, చిలసౌ., మజీలీ, జెర్సీ.. ఈ సినిమాలు సరికొత్త కథ, కథనాలతో ఆకట్టుకుంటున్నాయి. ఊప్పెనలా దూసుకువస్తున్న యువ దర్శకులు విభిన్నమైన కథలు సృజనాత్మకతతో సంప్రదాయ వారధులను అధిగమిస్తున్నారు. కళాత్మక వ్యాపారంలో నూతన పరిణామాలను తీసుకువస్తున్నారు. ఆ పంథాలో సరికొత్తగా వస్తున్న మరో చిత్రం… ఫలక్‌నుమా దాస్‌. విశ్వక్‌సేన్‌, సలోని మిశ్రా ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా పరిచయమైన విశ్వక్‌సేన్‌ స్వీయదర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా ఫలక్‌నుమా దాస్‌ ట్రైలర్‌ విడుదలైంది. అసలైన హైదరాబాద్‌నీ ఈ సినిమా పరిచయం చేస్తుందని ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది. ఓల్డ్‌సిటీలో జీవితాలు వారి ఆశయాలకు దర్శకుడు తెరరూపమిస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా తరుణ్‌భాస్కర్‌ విశ్వక్‌సేన్‌ని వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు తన శిష్యుడి సినిమాలో తరుణ్‌భాస్కర్‌ తొలిసారి ఓ పోలీసాఫీసర్‌గా ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేస్తున్నాడు.

ఓల్డ్‌సిటీలోని గల్లీ కోట్లాటల ఆధారంగా ఫలక్‌నుమా దాస్‌ నడవనుంది. జీవితం పట్ల పెద్ద పెద్ద కలలున్న ఓ పాతనగరం యువకుడికి ఎదురైన సమస్యలు, వాటిని ఎదుర్కొన్న తీరును వివరించనుంది. తెలంగాణ, ఉర్దూ కలగలసిన యాస ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. తన ప్రతి ఆల్బమ్‌తో ఆకట్టుకుంటున్న వివేక్‌సాగర్‌… ఈ సినిమాకు మంచి సంగీతం అందించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాను నిర్మించిన సురేష్‌బాబు… ఈ సినిమాకు సమర్పకులు.