తెలుగు తెరపై సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి బాలీవుడ్‌ను కుదిపేసేందుకు సిద్ధమవుతున్నాడు. అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా… హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా ఈ సినిమాను రీమేక్ చేశాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. రిలీజైన గంటలోనే 5 లక్షల మంది యూట్యూబ్‌లో వీక్షించారు. రెండు నిమిషాల నలభై నాలుగు సెకన్లు ఉన్న ట్రైలర్‌లో కబీర్‌ సింగ్‌ ప్రేమకథను సంక్షిప్తంగా డైరెక్టర్ వివరించాడు. తెలుగులో విజయ్ దేవరకొండ తప్ప మరెవరు కూడా చేయలేరేమో అన్నంతగా అర్జున్ రెడ్డి పాత్రలో ఇమిడి పోయాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్‌ని చూసిన ప్రేక్షకులు కబీర్ సింగ్ పాత్ర పోషించిన షాహిద్ కపూర్ నటనతో పోల్చుకోకుండా ఉండలేరు. ఇక అప్పట్లో తెలుగు ట్రైలర్ సృష్టించిన క్రేజ్ విషయానికి వస్తే సినిమాపై అంచనాలు పెంచింది. హిందీ టైలర్ విషయానికి వస్తే షాహిద్ కపూర్ కంటే విజయ్ దేవరకొండనే పాత్రను అద్భుతంగా పోషించాడని కనిపిస్తోంది. షాహిద్ కపూర్ కబీర్ సింగ్.. విజయ్‌ అర్జున్‌రెడ్డిలా అంచనాలను అందుకోవడం కష్టమే. ఈ విషయం తెలిసే ట్రైలర్‌ నిడివిని సందీప్‌రెడ్డి తగ్గించాడనిపిస్తోంది. అర్జున్‌రెడ్డి ట్రైలర్‌ 3 నిమిషాల 15 సెకన్లు ఉన్నప్పటికీ ఏమాత్రం బోర్‌ కొట్టలేదు. ట్రైలర్‌ చూస్తే సినిమాలో పెద్దగా మార్పులు ఉన్న దాఖలాలు కనిపించడం లేదు.