అందం అమ్మాయైతే.. ఐశ్వర్యరాయ్‌లా ఉంటుందని పాడుకుంది నిన్నటితరం. 45 ఏళ్ళ దాటినప్పటికీ వన్నెతరగని అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. అమాయకపు చూపులు, చక్కని నటనతో రాణించిన ఐశ్వర్య మరోసారి విలన్‌గా నటిస్తోంది. అదీ కూడా తనను వెండితెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో. పీరియాడిక్ డ్రామా `పొన్నియన్ సెల్వన్`లో నందిని అనే ప్రతినాయిక పాత్రలో నటించనుంది. తొలుత తటపటాయించిన ఐష్.. దర్శకుడి మీద నమ్మకంతో సరేనంది. పైగా ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. పదో శతాబ్దానికి చెందిన చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రాజు పెరియా పజువెట్టరైయర్ భార్య రాణి నందినిగా ఐశ్వర్య నటించనుంది. రాజ్యాధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు చేసే పాత్రిది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. చోళ సామ్రాజ్య పతనం చూడాలని పంతం పడుతుంది.
భారీ తారగణంతో పొన్నియన్ సెల్వన్‌ని తెరకెక్కించేందుకు మణిరత్నం ప్రయత్నిస్తున్నారు. ఐశ్యర్య తో పాటు.. అమితాబ్‌బచ్చన్, విక్రమ్, జయంరవి, శింబు, అమలాపాల్, మోహన్‌బాబులాంటి హేమహేమీలు ఈ సినిమాలో నటించనున్నారు. మొదట ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు లైకా ప్రొజక్షన్ ముందుకు వచ్చింది. ఐతే.. బడ్జెట్ భారీగా ఉండటంతో.. వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
1997లో తెలుగులో ఇద్దరుగా వచ్చిన, తమిళ్ ఇరువర్ సినిమాతో ఈ అందాల సుందరి కథానాయికగా కెరీర్ ప్రారంభించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయం సాధించనప్పటికీ.. నటిగా ఐశ్యర్యకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2010లో రావణన్ వచ్చింది. ఇది ఓ మోస్తారు విజయమే సాధించింది. ఇప్పుడు మూడోసారి మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య నటించనుంది.
2004లో వచ్చిన బాలీవుడ్ మూవీ `ఖాకీ`లో ఐష్ తొలిసారి ప్రతినాయిక పాత్రలో నటించింది.