శృంగారం శృతిమించితే జూగుప్స అవుతుంది. ఇప్పుడు తెలుగుతెరపై అలాంటి దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువతరం కథనాలు అంటూ.. ఫక్తు అశ్లీల సినిమాలను విడుదల చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి, RX 100 సినిమాలు ఇలాంటి సినిమాలకు ఓ దారిని చూపాయి. కథాబలం, విభిన్నమైన స్క్రీన్‌ ప్లేలతో ఆ సినిమాలు హిట్టయ్యాయి. కానీ.. ఇటీవల కొందరు దర్శకులు, నిర్మాతలకు మాత్రం.. అర్జున్‌రెడ్డి, RX100లో పరిధులు దాటిన శృంగారం మాత్రమే కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ డిగ్రీ కాలేజీ, రొమాంటిక్‌ క్రిమినల్స్‌, ఏడు చేపల కథ సినిమాలు.

డిగ్రీ కాలేజీ, రొమాంటిక్‌ క్రిమినల్స్‌.. ఈ రెండు సినిమాలు పూర్తిగా కాలేజీ నేపథ్యంలో తీసినవి. ఇక ఏడు చేపల కథ.. సదరు ప్రధాన పాత్రదారుడికి ఓ వ్యాధి ఉంటుందట. ఆ పేరు చెప్పి… పచ్చి శృంగారాన్ని తెరనిండా పరిచేశారు. ఏడు చేపల కథ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు. ఆ సినిమా లక్ష్యం ఒక్కట్టే.. నాలుగు డబ్బులు వెనకేసుకోవడం. డిగ్రీ కాలేజీ, రొమాంటిక్‌ క్రిమినల్స్‌ దర్శకులు మాత్రం.. ఉదాత్తమైన లక్ష్యాలతో సినిమాలు తీశామని చెప్పుకుంటున్నారు.

డిగ్రీ కాలేజీ సినిమా కథ యాదార్థంగా జరిగిందని చెబుతున్నారు. ఈ సినిమా ప్రేమ, పెళ్ళి.. కులం, అధికారం అనే నాలుగు ప్రధానాంశాలను చర్చిస్తుందట. అంతా బాగానే ఉంది కానీ.. నిజంగా జరిగిందని చెబుతూ.. ఏకంగా కళాశాలలోనే శృంగార దృశ్యాలు తీసేశారు. అందుకే.. ట్రైలర్‌ విడుదల చేయడానికి వచ్చిన జీవిత రాజశేఖర్‌ సైతం.. సదరు దర్శకుడిని అక్కడే కడిగిపారేసింది. నిజజీవితంలో బెడ్‌రూమ్‌లో విషయాలను నడిబజారులోకి తేలేం కదా.. అని చీవాట్లు పెట్టింది. సదరు దర్శకుడు సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

ఇక రొమాంటిక్‌ క్రిమినల్స్ కథ… వ్యసనాలు ముదిరితే పర్యవససానాలు ఎలా ఉంటాయో చర్చించే కథ అని చెబుతున్నారు.. ఆ సినిమా దర్శకుడు సునీల్‌ కుమార్‌రెడ్డి. గతంలో గంగపుత్రులు అనే మెచ్చుకోదగ్గ సినిమా తీసిన ఈ దర్శకుడు… ఫేటు బాగాలేకపోవడంతో.. రూటు మార్చాడు. ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ అని బీ గ్రేడ్‌ సినిమాలు తీశాడు. ఆ సినిమాలకు సీక్వెల్‌గానే ఇప్పుడు రొమాంటిక్‌ క్రిమినల్స్‌ తీస్తున్నాని ఆయనే చెప్పేశారు.

రూ. లక్షలు, కోట్లు ఖర్చుపెడుతూ ఉదాత్తమైన సినిమాలు తీయాలని, నలుగురికి మంచి సందేశం ఇవ్వాలని ఎవరూ చెప్పడం లేదు. కానీ.. నిజజీవితాల ఆధారంగా తీయాలనుకున్న, సమాజంలోని సమస్యలను సినిమా తీయాలనుకున్న ఎన్నో వ్యధలు ఉన్నాయి. మన దర్శకులకు మాత్రం అశ్లీలంలోనే అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. అదే నేటి సినీ విషాదం.

Degree Colleage, Romantic Criminals, Yedu Chepala Katha, Arjun Reddy, RX 100, Kabir Singh, Telugu Film Industry